కొంత మంది జనాలను ఒక రూం లొ పడేసి ఆకలికి అలమటించేలా చేసి ఇక తినక పొతే
చావే అనే పరిస్థితి కల్పించి ఆఖరి నిమిషాలలో వాళ్ల చేతుల్లో పులిహోర
పాకెట్లు వేస్తే? దానికి తొడు ఫలాన గొప్ప వంటగాడు చేసిన పులిహోర అని చెప్పి
మరి పంచితే? జనాలు పిచ్చిగా తింటారు. ఫలనా వంటవాడి పులిహోర అని చెప్పేసాం
కాబట్టి ఉప్పు, కారం సరిపొయాయా అని ప్రశ్నే రాదు. ఏమన్నా తక్కువైనా ఆకలితో
ఉన్నాంగా మనకే తేడా తెలియట్లేదేమో అని అనుకుంటాం పైగా అదే రూం లో మన లాగే
ఆకలితో ఉన్న ఆ వంటవాడి అభిమానులు కూడా ఉంటారు. వాళ్లు ఉరకే తినడం కాకుండా
ఆహా ఒహో అని తెగ పొగిడేస్తూ ఉంటారు కాబట్టి మనకు నచ్చకపోయినా లేదా గొప్పగా
అనిపించకపొయినా తప్పు మనదేమో అనిపిస్తుంది. పంటి కింద రాళ్లు తగులుతూనే
ఉంటాయి కానీ ఆకలిని రాళ్లేం అడ్డుకుంటాయి చెప్పండి. మామూలుగా ఐతే
ఊసేసేవాల్లమేమో కాని ఆ పరిస్థితిలో నమిలేస్తాం. ఆకలి అన్నీ
మరిపించేస్తుంది. ఇప్పుడు అత్తారింటికి దారేది విషయంలో అదే జరుగుతుందేమో
అనిపిస్తుంది. చాలా కాలం నుండి సినిమా లేక ఎదురుచూస్తున్న తెలుగు సినీ
ప్రియులను ఒక్కసారిగా పవన్ కల్యాణ్ సినిమా అని ఊదరగొట్టి వదిలారు. దానితో
పాటు లీకేజీ వల్ల వచ్చిన పబ్లిసిటీ అధనం. ఇక తప్పు ఒప్పుల గురించి ఎవరు
ఆలోచిస్తారు. సినిమాలొ నిజంగా బాగున్నవి అంటే అవి బ్రహ్మి ఆండ్
క్లైమాక్స్. క్లైమాక్స్ లో కూడా సంభాషణలు కొత్తవేమో కానీ సీన్ పాతదే. ఎన్నో
సినిమాల్లో చుసిందే. కానీ పవన్ కల్యాణ్ చేసాడు కాబట్టి మళ్లీ చూస్తున్నాం.
పాత ఆవకాయని కొత్త జాడీలో వేసి అమ్మేవాడిని తెలివైన వ్యాపారి అంటాం. ఇక్కడ
త్రివిక్రం చేసిందదే. కానీ ఇంతే ఆయన తెలివి అని మెచ్చుకోవాలో లేక తెలివి
తేటలు పూర్తిగా ఉపయోగించకుండా సినిమా తీసి పడేసినందుకు బాధపడాలో అర్ధం కాని
పరిస్థితి. త్రివిక్రం కాకుండా ఎవ్వరు ఇలా చేసినా అది పెద్ద విషయం కాదు.
త్రివిక్రం కాబట్టే బాధ. ఎదో బాలేని సినిమాని బలవంతంగా చూపెట్టారు అని ఎమీ
చెప్పట్లే. సినిమా బాగుంది అంతే అద్భుతంగా ఎమీ లేదు. ఇది మంచి సినిమా
మాత్రమే గొప్ప సినిమా ఐతే కాదు. ముందే చెప్పినట్లు సినిమాలు లేక
అల్లాడుతున్న జనాలకు పెద్ద సినిమా ఒకటి దొరికేసరికి పంటి కింద రాళ్ల లాంటి
ఇల్లాజికల్ సీన్స్ ని, చప్పగా అనిపించే పాటలు వచ్చే సంధర్భాలనీ కుడా
మర్చిపోయి కడుపు నింపుకున్నారు. అంతా అయ్యాక ఆకలి తీరిందే గుర్తుంటుంది
కాని రాళ్ల లెక్క ఎవడిక్కావాలి? కాబట్టి అన్నదాతా సుఖీభవ అనేసారు సినిమా
బంపర్ హిట్ అయి కూర్చుంది.
P.S:త్రివిక్రం ఇంతకుముందు అధ్భుతమైన సంభాషణలు రాసేవాడు. ఇప్పుడు వాటిలో ప్రాస ఉంటుంది కానీ పస ఉండట్లే.
P.S:త్రివిక్రం ఇంతకుముందు అధ్భుతమైన సంభాషణలు రాసేవాడు. ఇప్పుడు వాటిలో ప్రాస ఉంటుంది కానీ పస ఉండట్లే.
